jump to navigation

ఏం మనుషులు వీళ్ళు ఏప్రియల్ 29, 2008

Posted by chsprasad in సామాజికం.
Tags:
trackback

నేను ఆఫీస్ కు వెళదామని రోడ్ మీదకు వచ్చాను, ఇంతలో రంయ్ మంటూ ఒక మోటర్ సైకిల్ వాలా మీదకు వచ్చాడు, అయిపోయింది నాపని అని అనుకున్నా. అతను మురుగుకాలవలో పడటమో లేదా నేను మురుగు కాలవలో పడటమో జరిగిపోవాలి, కానీ అదృష్టం, తృటిలో ప్రమాదం తప్పిపోయింది. కనీసం అతనిలో ఎలాంటి ఫీలింగ్ ఉండకపోతే ఫరవాలేదు, నేనేదో కంట్రీ బ్రూట్ అన్నట్లు నా వైపు చూస్తూనే అంత స్పీడ్ లో వెళ్ళిపోయాడు . . . . ఏం మనష్యుల వీళ్ళు అనుకున్నాను.

ఇంతలో బస్ స్టాప్ కు చేరుకున్నాను. బస్ కోసం వెయిటింగ్. సుమారు 10 మంది నాతో పాటు బస్ కోసం వెయిటింగ్. నేనెక్కాల్సిన బస్ రావటం లేదు ఎంతసేపటికీ అని చిరాకు. ఇంతలొ ఆ చిరాకు ను పారద్రోలే సంఘటన జరిగింది. అదేంటంటే మా మధ్యలో ఒకాయన గోల్డ్ ఫ్లాక్ కింగ్ సైజ్ బయటకు తీసాడు. ఎంతో ఠీవిగా తనే స్టైలిష్ పర్సన్ లాగా ఎంతో స్టైలిష్ గా అగ్గిపెట్టెతో ఆ సిగరెట్ వెలిగించి, సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరలు కాలచ్చు భల్ సిగిరెట్టూ అనుకుంటూ, అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తీసుకువచ్చాడు, అంతకంటే ఏం చేయగలం దొరలాంటి వ్యక్తి కదా . . . . . . . ఏం మనుష్యులు వీళ్ళు అనుకున్నాను.

ఇంతలో రానే వచ్చింది నేనెక్కాల్సిన బస్. ఖాళీగా ఉంది, ఆపుతాడు కదా ఎక్కుదామని అనుకున్నాను, కానీ ఆగలేదు, స్లో అయి మరల యాక్సిలేటర్ అందుకోబోతుండగా రిస్క్ తీసుకుని ఎలాగోలా ఎక్కాను. అదడిగితే ఎలాంటి సమాధానం వస్తుందో ఊహించుకుని ఊరకుండిపోయాను. మెల్లగా ఒక పెద్ద మనిషి ప్రక్కన హమ్మయ్య అనుకుంటూ కూర్చున్నాను ఆర్టిసి వారి ఇద్దరు మనుష్యులకు కలిపి ఏర్పాటు చేసిన ఒకటిన్నర సీట్లో. కాసేపటికి ఏదో వాసన, ఉన్నకుందికీ పెరిగిపోతుంది. ఎంత ఘాటుగా ఉందంటే అది నా కడుపును దేవేస్తున్నట్లుంది. ఎక్కడనుంచో కాదు, నా ప్రక్కన పెద్ద మనిషి ఎంతో ఆనందంగా నోట్లో, గుట్కా అంటారు అనుకుంటా, నలుగుతూ ఉంది. అతను ఎంతో తన్మయత్వంలో ఉన్నాడు. ప్రక్కన కూర్చొని అనుకోకుండా పీల్చి ఇంత గా కడుపులో దేవేసినట్లన్నదానిని అంత తన్మయత్వంతో ఎలా నమిలి మింగేస్తున్నాడో అనిపించింది. ఇంతలో మరో షాక్. ఉన్నట్లుండి తల ప్రక్కకు తిప్పి తుపుక్కుమని బయటకు ఊసాడు కొంత పదార్దాన్ని, పాపం బయట వెళుతున్న స్కూటరిస్ట్ అత్యంత ప్రమాదం నుంచి చాకచక్యంగా తప్పించుకుని తన బట్టలు ఖరాబవకుండా, యాక్సిడెంట్ జరుగకుండా ఏదో తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు బస్ ను క్రాస్ చేసుకుంటూ. నా ప్రక్కన పరమానందం గారికి మాత్రం ఇదేమీ పట్టలేదు . . . . . ఏం మనుష్యుల వీళ్ళు అనుకున్నాను.

నేను దిగాల్సిన స్టేజి రాకముందే బస్ డోర్ వద్దకు చేరుకున్నాను. ఇంతకు ముందు అనుభవం దృష్ట్యా. దిగుతున్నాను నేను, ఇంతలొ ఒక చేయి నా నడుంపై పడి ముందుకు తోస్తుంది, వెనక్కి ఒక లుక్ ఇచ్చాను, అదేదో కామన్ గా అలవాటు ప్రకారం తోసినట్లు వెనుకతనిలో ఫీలింగ్ తప్ప అతను అలా ఎందుకు చేశాడొ, నేను చూసింది ఎందుకో తనకు కానట్లు ఇంకా తోసుకుంటూనే దిగాడు పాపం.అపుడనుకున్నాను బహుశా సినిమా హాల్ టికట్ లకొరకు అలా అలవాటుపడిపోయిన ప్రాణం కామోసు అని. ఇదిలా ఉండగానే కండక్టరు మహాశయుని గర్జింపు ఒళ్ళు జలదరించేలా ఎంతసేపు దిగుతారు అని, మాకు బస్ ఎక్కటం, దిగటం తెలియదన్నట్లు, మరొకవైపు బస్ చోదకుని అసహనం వలన దిగటం పూర్తి కాకుండానే మరల స్పీడ్ అందుకుని వెళ్ళిపోయింది. అలాగే దూకినంతపని చేసి బస్ దిగాము అక్కడ దిగవలసిన వారందరం. . . . . . ఏం మనుష్యుల వీళ్ళు అనుకున్నాను.

మెల్లగా నడుచుకుంటూ దగ్గరలోని మా ఆఫీస్ కు చేరుకున్నాను. అటెండెన్స్ రిజిస్టర్ లొ సంతకం పెట్టి మెల్లగా నిన్న సగంలో ఆగిపోయిన వర్క్ మెదలుపెట్టాను ఒక ఫైల్ తీసి. ఒకొకరూ చేరుకుంటున్నారు నా ఆఫీస్ కుటుంబంలొని సభ్యులు. అలా చేరుకుని ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. ఇంతో మెట్ల మీద నుండి గులకరాళ్ళ మోతతో ఒక తోటి ఉద్యోగి ఎవరినో వెంటబెట్టుకుని మరీ ఆఫీస్ లాప్ లేచిపోయేటట్లు మాట్లాడుతూ పైకి వచ్చా అటెండెన్స్ లో సంతకం పెట్టి తన సీట్లో కూర్చుని ఇంకా తన స్టీరియో సౌండ్ ఎఫెక్ట్స్ తొ మాట్లాడుతూనే ఉన్నాడు, కొంతకాలం నుండి ఇది అనుభవంలో ఉండటం వలన తేరుకుని త్వరలోనే మరల పని వైపు దృష్టి పెట్టాం. ఇంతలో తనతో పాటు వచ్చిన మిత్రుడు వెళ్ళిపోయినట్లున్నాడు, ఆ స్టీరియో సౌండ్ సిస్టం మా రూంలోకి ప్రవేశించింది, ఏమనగలం రోజూ మెఖ మెఖాలు చూసుకోవలసిన వాళ్ళం ఒకే ఆఫీస్ లో. సర్దుకు పోవాలి కదా మరి. లేకపోతే ఈ కబుర్ల రాయుళ్ళు వాళ్ళ కబుర్ల ప్రావీణ్యం సమర్ధత ఉపయోగించి ఇతనొక్కడే పని చేస్తున్నట్లు ఇంకెవరూ పనిచేయనట్లు ఫీలింగ్ ఉంది అని ప్రచారోద్యమం చేపట్టగలరు. దానితో నా పని సరి. . . . . . . ఏం మనుష్యుల వీళ్ళు అనుకున్నాను.

ఇలాంటి అనుభవాలెన్నో ప్రతి రోజూ. ఒకటి మాత్రం అర్ధం అయ్యింది. నా చిన్నపుడెవరో అన్నట్లు గుర్తు. మనుష్యులకు పరిసర జ్ఞానం ఎక్కువగా ఉంటుంది అందుకనే రోడ్ పై, ప్రయాణంలో, పబ్లిక్ ప్లేసెస్ లొ ఒకరినొకరు రాసుకుంటూ పోరు, అదే గీదెలూ, దున్నపోతులూ ఐతే వాటికి పరిసర జ్ఞానం అంతగా ఉండదు కాబట్టి అవి వాటిలో వాటిని, వాటితో పాటు మనుష్యులను, స్తంబాలూ, గోడలను కూడా రాసుకుంటూ పోతాయని. ఇంతకీ మనుష్యులలో కూడా ఈ పరిసర జ్ఞానం తక్కువైపోయిందా, అంతరించి పోయిందా, అనుమానం గానే ఉంది.

వ్యాఖ్యలు»

No comments yet — be the first.