అంతర్గత స్వార్ధాలు విడనాడండి జులై 16, 2009
Posted by chsprasad in Uncategorized.add a comment
ప్రతి మనిషి జీవితంలో వ్యక్తిగత స్వార్ధం ఎంతో కొంత లేకుండా ఉండదు. అది ఎవరికి వారికి స్పష్టంగా తెలుస్తుంది. అది లేదు అని ఎవరన్నా భావిస్తే అది వారిని వారు ద్రోహం చేసుకుంటున్నట్లే. Cognitive dissonance లొ వారు బ్రతుకుతున్నట్లే. స్వార్ధపరుడు అని సమాజంలో ముద్రవేయించుకున్న వాడు, ఆ స్వార్ధం లోనే బ్రతుకుతూ అందులోనే ఆనందాన్ని పొందుతాడు. కాని మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలొ, మనలాంటి సాధారణ వ్యక్తులలో అంతర్గతంగా ఉండే చిన్న చిన్న స్వార్ధాలుఅలాంటి ఆనందాన్ని ఇవ్వవు సరికదా, ఆందొళన, అప్రశాంతత లలోకి జీవితాన్ని నెట్టివేస్తాయి.
తను, తన పేరు, తన పలుకుబడి, తన ఉద్యోగం, తన హోదా, తన కుటుంబం, తన ఊరు, తన కులం, తన మతం, తన జాతి, తన ప్రాంతం ఇలా ఎన్నో ఎన్నో మన జీవితాలని ప్రతి నిముషం ప్రభావితం చేస్తూనే ఉంటాయి. స్వార్ధంతో లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటాయి.
ఈ స్వార్ధం ముందుగా ఇతరులను తప్పుదారి పట్టించటానికి పురికొల్పుతుంది. ఆ క్రమంలో మరింత స్వార్ధపూరిత ఆలోచనలతో మనిషి వ్యక్తిత్వాన్ని దిగజారుస్తుంది. ఇంక మనం ఎల్లపుడూ బయటకు వ్యక్తీకరించే మంచి చెడూ, నీతి నిజాయితీ కూడా మనకు గుర్తురానంతగా, గుర్తుకు వచ్చినా పట్టించుకోనంతగా ఈ స్వార్ధ లక్షణం మన వ్యక్తిత్వం పై స్వారీ చేస్తుంది. ఎదుటి వారికి మన మనసులోని అంతర్గత భావాలను, స్వార్ధాన్ని మరింతగా ప్రస్ఫుటంగా గోచరించేటట్లు చేస్తుంది. కాని మనం ఇతరులు ఇంకా మనల్ని స్వార్ధరహిత వ్యక్తి గానే నమ్మేటట్లు చేయటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. అలానే వారు మనల్ని ఇంకా ఇంకా గుర్తిస్తున్నారనే మనం నమ్ముతుంటాం. ఆ విధంగా మనల్ని మనం ద్రోహం చేసుకుంటూ ఇతరుల్ని కూడా ద్రోహం చేస్తాం లేదా ప్రయత్నిస్తాం.
ఎవరైనా మనలోని అంతర్గతంగా ఉన్న ఈ స్వార్ధానికి అడ్డుగా ప్రవర్తిస్తున్నట్లు, చర్యలు చేపడుతున్నట్లు అనిపిస్తే ఆ ప్రవర్తనను లేదా చర్యలను అడ్డుకోవటానికి, మన స్వార్ధాన్ని నిలబెట్టుకోవటానికి చేసే ప్రయత్నం లో మనం చేయకూడని, చేయరాని పనులు చేస్తూ ఉంటాం. వారు చేసిన మంచిని, ఇచ్చిన సహకారాన్ని, అందించిన ఆసరాను కూడా మర్చిపోతాం. మన స్వార్ధం వారిని శత్రువులుగానే చూస్తుంది. ప్రతి సంఘటననూ ఆ దృష్టితొనే ఎంచుతాం. చివరకు చిన్న చిన్న విషయాలలో కూడా ఎదుటివారిపై పైచేయి సాధించటానికి ఎన్నో ట్రిక్స్ ప్లే చేస్తుంటాం, వాటిని మన పరిధిలో వీలైనంతవరకు ఆచరణలోకి తీసుకువస్తాం. వాటికి ఎన్నో అందమైన అబద్ధాలను, స్వార్ధం ఏమీ లేదని నిరూపించటానికి వివరణ పై వివరణలను ఇచ్చుకుంటుంటాం. ఇవన్నీ ఎదుటివారికి మన నిజమైన స్వార్ధాన్ని అద్దంలో చూపుతాయి. ఎదుటి వారికి స్పష్టంగా మన స్వార్ధం గోచరిస్తున్నా మన వివరణలను వదలివేయం, కోపం, కసి పెరుగుతుంటుంది. దానితో మరిన్ని తప్పులు చేస్తూ పోతుంటాం. అసలు/ముఖ్యమైన నిజాల్ని దాచేందుకు ప్రయత్నిస్తుంటాం. మంచి మిత్రులను కూడా ఈ స్వార్ధంతో దూరం చేసుకుంటాం. నా వల్లనే వేరే వారికి సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది అనే భావనలో విహరిస్తాం. చివరికి వారి దృష్టిలో విలువను కోల్పోతాం. నిజమైన మిత్రులెవరో కూడా తెలిసీ వారిని దూరం చేసుకుంటాం.
అసలు దీనంతటికీ మనలో ఉన్న స్వార్ధమే కారణమని మనకు స్పష్టంగా తెలుసు. దీనివలన మనం సాధించేది ఏమీ లేకపోయినా దీనిని వదలటానికి ఇష్టపడం. అది అంత అవసరమా అంటే అదీ కాదు. ఒక్కసారి స్వార్ధాన్ని ఒప్పుకుని విచారాన్ని వ్యక్తపరిస్తే మనసు తేలికపడిపోతుంది. అలాంటి చిన్న చిన్న స్వార్ధాలు దూరమైపోతాయి. Fair & frankness లో ఉన్న ఆనందం మరల మన కళ్ళముందు కనిపిస్తుంది. జీవితం లో వెలుగునింపుతుంది. అలా కాకుండా స్వార్ధాన్ని అలాగే ఇంకా ఇంకా కొనసాగించుకుంటూపోతే దానివలన నష్టం మనకు, మన మనసుకే – ఎపుడూ ప్రశాంతత ఉండదు. మనసు, దానితో పాటు శరీరం కూడా కుళ్ళిపోతుంది. ఇక రూపానికే మనం మనుషులుగా మిగిలే స్థితికి వచ్చేస్తాం.
మరెందుకు ఎలాంటి ఉపయోగాన్ని కలిగించని ఈ స్వార్ధాన్ని వదలలేం? ఎందుకు ఈ ఊబిలో ఇరుక్కుపోతాం? ఎందుకు దీని కోసం ఇతరుల ముందు మన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటాం? ఎందుకు మంచి మిత్రులను దూరం చేసుకుంటాం? ఎందుకు మన ప్రవర్తన లో fair and frankness ను కోల్పోతాం? జరిగే నష్టం తెలిసిన తర్వాత అయినా ఎందుకు మన ప్రవర్తన, చర్యలు మానుకోకుండా దానిచుట్టే మన మనసును కేంద్రీకరిస్తాం?
ఈ స్వార్ధాలని వదులుకుందాం, ప్రశాంతంగా జీవిద్దాం, fairness & frankness నుండి దూరమైతే మనసులోని నిర్మలత్వం దూరమౌతుంది. మనం మాత్రమే గొప్పవాళ్ళమని ఎపుడూ భావించకూడదు. మనం చాలా చాలా అతి సాధారణ వ్యక్తులం అనే భావనలొ ఉంటూ జీవితంలో వాస్తవికతకు దగ్గరగా నిస్వార్ధంగా జీవిస్తే, అపుడు నిజమైన ఆనందం మీ తోడవుతుంది. మన మనసుకు, శరీరానికి అదే ఆరోగ్యాన్ని ఇస్తుంది. మత్తు మందులు, పానీయాలు కు బానిసైనట్లు ఒక సారి స్వార్ధానికి బానిసైతే, దాని నుంచీ బయటపడకపోతే భావి జీవితాన్ని ఒంటరిగానే జీవించే దుస్థితికి చేరిపోతాం.
చివరిగా ఒక్కమాట:
ఇదంతా చదివిన తర్వాత ఇది నన్ను గురించి వ్రాసినట్లున్నదే అనే అనుమానం మీకు కలిగితే మీలో ఏదో చిన్న స్వార్ధం గూడుకట్టుకుని ఉన్నట్లే, దానిని కనిపెట్టి మీ వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుకోండి. ఎలాంటి పరిస్థితిలోనూ ఫెయిర్ అండ్ ఫ్రాంక్ నెస్ వదులుకోకండి – ఇది ఎవరిని ఉద్దేశించి వ్రాయలేదండోయ్, జస్ట్ ఫర్ టెస్ట్ 
మీడియా వారికి ఒక మనవి: ‘‘5 సంవత్సరాల క్రితం ఈ రోజు’’ శీర్షికను ప్రారంభించండి! జనవరి 29, 2009
Posted by chsprasad in Uncategorized.add a comment
వచ్చేస్తున్నాయ్ ఎన్నికలు ఎన్నో కలల (మనకు కాదండొయ్) తో
అందుకే ఒక్కో పార్టి వారు వారి వారి విశ్వరూపాలు ప్రదర్శిస్తూ ప్రజలను మభ్యపెట్టటానికి ‘‘శకుని’’ ఏ పాటి అనే విధంగా రోజుకో డ్రామా ను రక్తి కట్టిస్తున్నారు.
102 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టి అని చెప్పుకునే పార్టి లొ 102 సంవత్సరాల చరిత్ర పార్టి కి ఉంది కాని అలా చెప్పుకునే వీరికేది? వాళ్ళే కాకుండా 9 సంవత్సరాల లక్ష్యం లేని పాలన తొ అధికారం నుండి తొలగించబడిన వాళ్ళు ఈ రోజే పార్టి పెట్టినట్లుగా అర్ధం పర్ధం లేని హామీలు, హామీ లలో కూడా పోటీ పరీక్షల లో పాల్గొంటున్నట్లుగా ఉంది. వీరిది 25 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టి. ఈ రెండు పార్టీ లు వారి వారి పార్టీలకు తెలంగాణా తొ సహా చాలా విషయాలలో ఇప్పటికి కూడా ఒక స్పష్టమైన పాలసి (అధికారం లో లేని పార్టి అధికారం కోసం తెలంగాణా పై ఒక స్పష్టమైన పాలసీ (?)ని ఈ మధ్యనే ప్రకటించిందనుకోండి) లేకుండా నిన్న గాక మొన్న పుట్టి ఇంకా పురిటి నొప్పుల నుండే బయటపడలేకపోతున్న మరో పార్టిని పాలసీ ఏంటి అని నిలదీస్తుంటే దిగజారుడుతనానికి పరాకాష్ట అని అనిపించక మానదు.
ఏ పార్టి ఎన్ని మాటలు చెప్పినా, మాయలు చేసినా, ఏ వ్యక్తులు దేనిని ఎలా రాజకీయం చేసినా అంతా అధికారం లక్ష్యం గానే, ప్రజలకు టోపీ దిశ గానే. ఇదెవరూ కాదనలేని సత్యం.
మామను వెన్నుపోటు పొడిచి అధికారం లొకి వచ్చాడని ఒకాయన పై గగ్గోలు పెడుతున్న వాళ్ళు, ఆ పార్టి అధినేత ఏ లక్ష్యం తొ ఆ పార్టిని స్థాపించారో మర్చిపోయినట్లున్నారు. ఏ పార్టినయితే ఈ దేశం నుండి పారద్రోలాలని, సమాధి కట్టాలని నినదించి ఒక ప్రాంతీయ పార్టిని పెట్టారో, ఆ ప్రాంతీయ పార్టిలోని వాళ్ళు (ఒక కుటుంబ సభ్యురాలితో సహా), దుష్ట పార్టిగా ఆ నాయకుడు నినదించిన పార్టిలొ అధికార దాహం తో చేరిపోయి, చనిపోయినాయనకు మాత్రం క్షీరాభిషేకం చేస్తూ ఉంటే అంతకంటే నిర్లజ్జ ఇంకేదైనా ఉంటుందా. ఎవరిది ఇక్కడ వెన్నుపోటు?
అధికారం ఉంది కదా అని అహంభావానికి పోయి ఆ అధికారాన్నే కోల్పోయి సమర్ధులైన వారంతా ఒక్కొక్కరూ పార్టిని విడిచి వెళ్ళిపోతుంటే కార్యకర్తలు మాత్రం పార్టిని వదిలి వెళ్ళ లేదు అని సర్దుకు చెప్పుకుంటూ ఇప్పటికీ వాస్తవాలకు దూరంగా కలలలో విహరించే మరో నాయకుని కలలకు ఏ భావ్యం ఉందో ప్రజలే తేలుస్తారు.
ఎప్పుడు ఎందుకు ఎవరితో కలుస్తామో అనేది తెలియకుండా బ్రతుకులు వెళ్ళతీసే మరో రెండు పార్టీలు వారి ప్రజా ఉద్యమాల బదులు గా సీట్ల బేరసారాల ఉద్యమాల లో ఊపందుకుంటున్నాయి.
సంస్థాగత పునాది వేసుకోకుండా ఒకే వ్యక్తి, ఆయన కుటుంబమే పార్టిగా నడుపుకుంటూ వస్తూ దరి చేరిన వారిని దూరం చేసుకుంటూ, కుల రాజకీయాలకు పురిటి లోనే బలైపోయేటట్లుగా నడకలు నడుస్తున్న పార్టి కూడా అధికార లక్ష్యంతొ అసలు సమస్య ను ప్రక్కన పెట్టేసింది. నమ్మకంతొ దరిచేరిన వారిని ఒక్కొక్కరిని దూరం చేసుకుంటున్నట్లు కనపడుతొంది. అధికారం రాకముందే ఇలా ఉంటే నిజంగా అధికారం వస్తే?
వీరందరికి కళ్ళు తెరిపించే రోజు కోసం ప్రజలు సిద్ధపడాలంటే పత్రికలు వారి వారి పాత్ర సరైన రీతిలో పోషించే సమయం ఆసన్నమైంది. అంతే కాని పార్టిలకు వంతగా మారిపోయి, గ్రూప్ లు గా నడుస్తున్న వార్తా పత్రికలు, ఒకే వేదిక పైకి అన్ని పార్టీల ప్రముఖులను పిలిచి వారి వారి అభిప్రాయాలు సిద్ధాంతాలను చెప్పించాలని ప్రయత్నం గా చూపించాలనుకుని ఒక టీవి ఛానెల్ ఏం చేసింది ఒక పార్టి వారికి సంబంధించిన ఉగ్ర రూపాలను మాత్రం అక్కడే ప్రేక్షకులుగా ఉంచి ఒక నాయకునికి వత్తాసు గా కధ నడిపించి అందరి మధ్య అగాధాన్ని పెంచి పోషించింది. కక్షలూ కార్పణ్యాలూ పెంచడానికి 24 గంటలూ నిరంతర పోట్లాట స్రవంతిని నడుపుతూ, సాధారణంగా సమసిపోయే చిన్న చిన్న విషయాలను పదే పదే ప్రస్తావించి చివరకు చర్చావేదికల పేరుతో వచ్చిన వారిని రెచ్చగొట్టి సమస్యల ను మరింత జఠిలం చేస్తూ తన సామాజిక కర్తవ్యాన్ని ? చాలా చక్కగా నెరవేరుస్తున్నాయి కొన్ని టివి ఛానెల్స్.
ఎంతో బలమైన మీడియా గా ఎలక్ట్రానిక్ మరియూ ప్రింట్ మీడియా వారికి నేను మనవి చేసుకునేదేంటంటే: ముందుగా చిన్న చిన్న ఉదాహరణలు:
1. ఆయిల్ కంపెనీలతో కుమ్మక్కయి ఎప్పుడ పడితే అప్పుడు ఎన్నో సార్లు గత కొన్ని సంవత్సరాలుగా (ఇంతకు ముందు పాలించిన ప్రభుత్వ హయాం నుండి మొదలైంది నాకు గుర్తున్నంత వరకు) అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగి పోయాయని చెప్పుకుంటూ పెట్రోల్ డీజెల్ ధరలను పెంచుతూ వస్తున్నాయి ప్రభుత్వాలు. 147 డాలర్లు ఒక బారెల్ రేటు నుండి 35 డాలర్లకు అంతర్జాతీయంగా ఆయిల్ ధర తగ్గిపోయింది. అంటే మన కు ఎంత మేర తగ్గాలి ఎంత మేర ప్రభుత్వం తగ్గించింది అనేది ప్రజల పక్షాన ఉండి ఎందుకు ప్రజలను మీడియా ఉద్యమం వైపు నడిపించదు? ఎందుకు పాలక ప్రతి పక్షాలు దీనిపై మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఉద్యమాలే ఊపిరిగా చెప్పుకునే పార్టీలు ఎందుకు తగినంతగా స్పందించి ఉద్యమాలు నడపవు?
2. మూడున్నర సంవత్సరాలుగా అనేక కుంభకోణాలతో, అక్రమాలతో, అవినీతితో నడిచిన ప్రభుత్వం ఎన్నికల సంవత్సరంలో మాత్రం అన్ని వర్గాల వారికి ఎంతో కొంత ఆర్ధిక పరమైన వెసులుబాటు కల్పిస్తూ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. ఎందుకు మొదటి 4 సంవత్సరాలలో ఈ నిర్ణయాలు తీసుకోలేదు? ప్రతి పక్ష పార్టి అసలు ఎలాంటి పాత్ర పోషించింది ప్రజల పక్షాన? ఇపుడెందుకు ఇన్ని హామీల మీద హామీలు ఇవ్వాల్సి వస్తోంది? ఇదంతా ప్రజలకోసమే అంటే ఈ పాలక, ప్రతి పక్ష పార్టీలను ఎవరు నమ్ముతారు? వీటి పై మీడియా ఎందుకు తగిన రీతిలో స్పందించదు?
3. 5 సంవత్సరాల క్రితం ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడారు? వారే ఇపుడు ఎందుకు ఎలా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం లో జరిగిన కుంభకోణాలెన్ని ఎలా జరిగాయి, ఈ ప్రభుత్వం లో జరిగిన జరుగుతున్న కుంభకోణాలేమిటి – ఇవన్నీ మీడియా ప్రజలకు ఎందుకు నిరంతర వార్తా స్రవంతి లా ప్రచారం చేయదు
ఇదే వార్తా పత్రికల వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా విన్నపం. ప్రజలను గతంలో మరియూ ప్రస్తుతం జరుగుతున్న ఈ భాగోతాలన్నింటి పై నిరంతరం జాగరూకులను చేయండి నిస్పక్షపాతంగా.
THIS DAY THAT AGE వలె 5 సంవత్సరాల క్రితం ఈ రోజు అనే శీర్షిక, వార్తా ప్రసారం నిరంతరం చేస్తుండండి. ప్రజలకు వారు గుర్తు తెచ్చుకోలేనివాటిని గుర్తు చేయండి. ఈ నాటకాల తెరలను తొలగించండి. ఏ పార్టీని ఈ నాటకాల తెరలనుండి తప్పించకండి.
ఇది ఏ పార్టీకో, ఏ ఒక్కరి కో అనుకూలంగా కాకుండా, వ్యతిరేకంగా కాకుండా ఉన్న వాస్తవాల ఆధారంగా నడపండి. మాటల చాతుర్యాలను పోస్ట్ మార్టం చేయండి.
విజయవాడ పరిసరాలలోని తెలుగు ఔత్సాహికులకు, బ్లాగర్లకు ఆహ్వానం ఫిబ్రవరి 12, 2008
Posted by chsprasad in Uncategorized.2 comments
మనం తెలుగు వారం! భారత దేశంలొ హిందీ తర్వాత అతి ఎక్కువమంది మాట్లాడే భాష మన తెలుగు! ఇది మనకు గర్వ కారణం! రండి! మనందరం కలిసి తెలుగుకు మరింత ప్రాచుర్యం కల్పిద్దాం!
కంప్యూటర్, అంతర్జాలం (ఇంటర్నెట్) లలొ తెలుగు వాడకం పై నిరంతరం శ్రమిస్తున్న శ్రీ వీవెన్, శ్రీమతి జ్యోతి, శ్రీ నల్లమోతు శ్రీధర్ వంటి మహా వ్యక్తుల స్పూర్తి ప్రోత్సాహాలతో విజయవాడ పరిసరాలలోని తెలుగు ఔత్సాహికులకు, బ్లాగర్లు, కంప్యూటర్ ఎరా మాసపత్రిక పాఠకుల సమావేశాలు తరచుగా ఏర్పాటు చేసుకుందామనే తలంపుతో ఈ ఆహ్వానం పలుకుతున్నాను.
అందరం ఒకచోట కలిసి కంప్యూటర్, ఇంటర్ నెట్ (అంతర్జాలం) లలో తెలుగు వినియోగం, కంప్యూటర్ ఎరా తక్షణ సాంకేతిక సహాయం చాట్ రూం వినియోగం పై విజయవాడ నుండి మన వంతు పాత్ర పోషించే విషయంలొ ఈ ఆహ్వానం ఉంచబడినది. దయచేసి వీలైనంత త్వరలొ స్పందిస్తారని ఆశిస్తున్నాను. మీ వివరాలు, ఫోన్ నెంబరు జోడించి మీ కామెంట్ తెలియచేయగలరు.
ఇట్లు
చిలకపాటి శివరామ ప్రసాద్, విజయవాడ
సెల్ నెం: 9866369288
Hello world! జనవరి 19, 2008
Posted by chsprasad in Uncategorized.1 comment so far
Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!